Tuesday, July 31, 2012

దిద్దు.... సరిదిద్దు.. తీర్చిదిద్దు..!

సమయం : తెలీదు.
సంవత్సరం: గుర్తు లేదు. 
ఎప్పుడూ?:  ఏమో.. మర్చిపోయాను.(ఎయిత్  క్లాస్ లో అనుకుంటా)
ప్రదేశం: మా స్కూల్ లో.. ఎగ్జాం హాల్ లో..!

నేనేం జరగకూడదనుకున్నానో... అదే జరిగింది. ఆఖరి  పరీక్ష రోజున ఇన్విజిలేటర్ గా మా క్లాస్ టీచర్లు రాకూడదనీ,  కస్తూరమ్మ గారు అస్సలు రాకూడదు అనీ బలంగా కోరుకున్నా.. కానీ కోరిక లే మనిషి దుఃఖానికి కారణం కదా...అవి తీరకపోతే...  :-) ).
చాకిరేవు లో బలమైన శ్రామికుడు బండకేసి బట్టల్ని బాదుతున్నంత శ్రద్ధ గా పరీక్ష రాస్తున్నాను.
ఆ సంగతి నా చుట్టూ మూగి, అంతకంటే శ్రద్దగా కాపీ కొడుతున్న నా "ఉపగ్రహ" మిత్రులకీ, "ఏయ్.... ఏంటా గోలా?" అని కంట్రోల్ చేస్తున్న మా కస్తూరమ్మ టీచర్ గారికీ తెలుసు గానీ, మర్నాటి నుండి దసరా సెలవులు అని తెలిసినా గానీ, నా గుండెల్లో గందరగోళం గుసగుసలాడుతుందనీ, తొందరపాటు తొణికిసలాడుతుందనీ, దిగులు దెయ్యం లా తరుముతుందనీ నాకే తెలుసు. నా ఒక్కడికే తెలుసు.


"ఒరే... రాజ కుమారూ.. .నీ వెనకోడూ, పక్కోడూ నీ పేపర్లో చూసి రాసేస్తున్నార్రా...! చూస్కో.. " బహిరంగంగా హింటిచ్చారు కస్తూరమ్మ గారు జాంకాయలు నములుతూ, పిప్పి కూర్చున్న కుర్చీ పక్కన ఊసేస్తూ.
మరొకరైతే అక్కడ సీన్ మరో రకంగా ఉండేది కాపీ కొడుతున్నందుకు. ఈవిడ ఏమిటీ ఈ రకం గా చెప్తున్నారు అని నేను అదోరకం గా చూడ్డం మొదలెట్టాను ఆవిడ వైపు, ఆఖరి ప్రశ్న కి జవాబు రాసేసీ, ఆన్సర్ షీట్ అట్ట కింద మూసేసీ.

మాకు సోషల్/ఇంగ్లీష్ చెప్పేవారు ఆవిడ. అంతెత్తూ, ఇంత లావూను. చాలా నెమ్మదిగా నడిచేవారు. ఏడున్నర అడుగులు పైన పొడవుండే వాళ్లబ్బాయ్ బండి మీద డ్రాప్ చేసేవాడు రోజూ. ఎప్పుడన్నా కోపం రావటం గానీ, ఏ పిల్లోణ్ణయినా కొట్టడం గానీ చూళ్ళేదు నేను. అంతకు ముందు మా అమ్మగారికి కొలీగ్ అవ్వటం తో కొంచెం చనువుంది నాతో.


అప్పుడప్పుడూ హైవే రోడ్ మీద పోయే లారీల గోల, మేడమ్ కస కసా నముల్తున్న జాంకాయల హాహాకారాలు మినహా ఏ శబ్దం లేదు.
"ఏట్రా ఆబ్బాయ్..అలా చూస్తున్నావ్? చదువంటే ఈ క్లాసు పుస్తకాలూ- పాఠాలూ, భట్టీలూ-మొట్టికాయలూ, ఎగ్జామ్సూ- మార్క్సూ మాత్రమే కాదురా.. జీవితం లో నేర్చుకోవాల్సినవీ, అలవర్చుకోవాల్సినవీ బోల్డున్నాయ్. అది పరీక్షలతో పూర్తయిపోయేదీ కాదు, ఆకలి కడుపు నిండాక ఆగిపోయేదీకాదు, అసలీ మార్కులు మేటరే కాదు. సామర్ధ్యానికి కొలమానాలు అస్సలు కాదు" .... చెప్పుకుంటూ పోతున్నారు.

గణ గణా బెల్ మోగిందీ. వెళ్ళిపోయేముందూ... "రేపు మా ఇంటికొచ్చేయ్ రా... పేపర్లు దిద్ది పెట్టేద్దువూ" అనేసి  నా మనసులోని కంగారుకీ, తొందరపాటుకీ, దిగులు కీ గల కారణాన్ని బయటపెట్టేసి వెళ్ళిపోయారు. బాగా చదువుతాడూ అనే పేరున్న వాడు ఆటోమేటిక్ గా క్లాస్ లీడర్ అవుతాడు. ఇంగ్లీష్ లో లీడర్ అంటే తెలుగు లో "పెద్ద పాలికాపు" అని అర్ధం.

దసరా సెలవులు రెండ్రోజులు ఎంజాయ్ చేసీ, ఏడుస్తూ, కాళ్ళీడుస్తూ మా మేడమ్ ఇంటికి నడుస్తూ ఉంటే కొన్ని పనికిరాని పరిశీలనలు మెదడు లో మెదిలాయి.
స్కూళ్ళలో ఈ ఎగ్జాం పేపర్లు కరెక్ట్ చేసే విధానాలు చెప్ప్పాలి మీకు. యెస్.. ఐ హేవ్ టూ టెల్ ఇట్ నౌ.

ఒకటో రకం :
ఉదాహరణకి... మా మాతా, పితా.  మా వాళ్లని చెప్పడం కాదు గానీ
రూల్స్ విషయం లో అపరిచితుడు సినిమా లో రామానుజం టైపు. పరీక్ష పెట్టిన రోజే  పేపర్లు  దిద్ది మార్కులు రిజిస్టర్ చెయ్యక పోతే కడుపు నిండా తిన్నా, ఆకలేసినట్టు గానూ, బిందెడు నీళ్ళు తాగినా దాహమేస్తున్నట్టు గానూ ఉంటాది వీళ్ళకి. వీళ్ళ హార్డ్ వర్క్ తో నాలాంటోళ్ళకి పెద్దగా ప్రాబ్లెంస్ ఉండవు.

ఒకటిన్నర  రకం:
ఉదాః మా లెక్కల మాష్టారు వెంకట్రావు గారు. ఈయన అందరి మెయిన్ పేపర్లూ బుద్ధిగా కరెక్ట్ చేసేసీ, బిట్ పేపర్లు రాండమ్ గా క్లాస్ లో స్టూడెంట్స్ కి పంచేసీ, ఆన్సర్స్ బోర్డ్ మీద రాసేసీ ఒక్కొక్కళ్ళ చేతా ఒక్కో పేపర్ కరెక్ట్ చేయించేసేవారు. ఐదు నిమిషాల్లో మేటర్ ఫినిష్.. దీన్నే సాఫ్ట్ వర్క్ అంటారని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యి హార్డ్ వర్క్ చేస్తుండగా తెలిసింది.

రెండో రకం...ఆ చెప్పడం ఎందుకూ?... మేడంగారి ఇల్లొచ్చేసిందీ.. రండి మీరు కూడా..!

కస్తూరమ్మగారుః వచ్చావా.... నువ్ ఏ ఊరికో చెక్కేసుంటావనుకుని ఎంత టెన్షన్ పడ్డానో..! ఎక్కడికి పోయావ్ ఈ రెండ్రోజులూ? ఒకటా రెండా? గాడిదల గుంపు లాగా నూట ముప్పై మంది. ఒక్కదాన్నీ ఎన్నని దిద్దేదీ?
నేనుః ..........
క.గాః టిఫిన్ తిని, టీ తాగమ్మా... కొంచెం ఓపిక వస్తుందీ..!
నేనుః వద్దండీ.. ఇంట్లో తినొచ్చాను.
క.గాః నిన్ను కాదురా... మా పెద్దదానికి ఒంట్లో బాలేదు. దాన్నీ అడుగుతుంటా..! ఇదిగో పేపర్ల కట్ట.
నువ్ నీది తప్ప మిగిలినవన్నీ దిద్దెయ్యి..  నీ పేపర్ నేను కరెక్ట్ చేస్తానూ.

అది పేపర్ల కట్ట కాదు..

"క్లాస్ లో నాకు కాంపిటీషన్ వచ్చినోళ్ళ జుట్టు నా చేతికిచ్చే" వరం,
"నా ఫ్రెండ్స్ కి మంచి మార్కులేసి నన్ను హీరోని చేసే" లాభం.
"వందమంది జుట్టుకున్న చమురు నా చేతికంటే" నష్టం.
నా పండగ సెలవుల్ని సర్వ నాశనం చేసే"  శాపం.

క.గాః ఏరా.. నిన్నా, మొన్నా ఇక్కడకి రాకుండా ఎన్నెస్సమ్మ (Natural science madam) ఇంటికి పోయావా ఈ పని మీద? అయినా నీకు  నా కంటే ఆవిడే ఇష్టం లే. (నా పక్కనే కూర్చొని బియ్యం ఏరుకుంటూ)

నేనుః లేదండీ... అక్కడకి సాయంకాలం వెళతానండీ. లేదంటే ఆళ్ళ ఎదురింట్లో ఉండే మా క్లాస్ అమ్మాయిల బ్యాచ్ తో కరెక్ట్ చేయించేస్తున్నారండీ. మొన్నటికి మొన్న ఆ జయంతీ, ఝాన్సీరాణీ ఏం చేశారనుకున్నారు? వాళ్ళు రాసిన సోదికి ఫుల్ మార్క్స్ వేసేసుకొనీ, నాకు పాస్ మార్క్స్ వేశారు. అప్పటి నుండీ ఆ మేడమ్ గారు కూడా నాకే అప్పజెప్పారు. (పరా... పరా ఎగ్జాం పేపర్లు కరెక్ట్ చేసుకుంటూ)

క.గాః హ...మ్మా.. మాయిదారి గుంట్లూ... అంత పని చేసేరా?

నేను(మనసులో..) : కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.... ఈ నాగేష్ గాడికి  నోట్లో సున్నుండ పెట్టీ కడుపు లో గుద్దాలి. వరల్డ్ మేప్ లో దేశాల్ని గుర్తించమంటే, మా మండలం లోని ఊరి పేర్లన్నీ మేప్ నిండా రాసేశాడు. (నిజంగానే జరిగిందిది). కానీ వాడుండేది తెలుగు మాష్టారి పక్క పోర్షనే.. నా మార్కులు వాడి చేతుల్లోనే ఉన్నాయ్.  రిస్క్ తీసుకోకూడదు..
వేసేశా... వాడికి ఫుల్ మార్క్స్ వేసేశా...

************************************************************************
నాల్రోజుల్లో అందరి ఇళ్లళ్ళోనూ ఈ చాకిరీ అంతా అయిపోయింది. అహో... ఆనందమే ఆనందం. బ్లాడర్ ఫుల్లయిపోయిన వాడు పాట పాడాక కలిగే ఆనందానికి సాటి రాగల ఆనందం.
మిగిలిన నాల్రోజుల సెలవులు ఎంజాయ్ చేయడానికి పెట్టె పట్టుకొని
పరుగులు పెడుతూ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయాను.

విధి వండిన వింత పాయసాన్ని గిన్నెల కొద్దీ తాగిన నేను అడుగు పెట్టగానే.. మా తాతయ్య కళ్ళలో మెరుపు చూశాను.

తాతయ్యః "ఒరే శిలపడా...(అర్ధం అడక్కండీ.. నాకు తెలీదు)... ఈ పెద్ద బొరికీ, చిన్న బొరికీ (మా మాయలు) నాకు పనికొచ్చే పనులు ఎప్పుడు చేసేర్రా? మీ చిన్న పిన్ని కొంచెం హెల్ప్ చేసిందీ... ఇయ్యిగో మిగిలిన పేపర్లు నువ్ దిద్దెయ్యరా..! "

నేనుః ...................
నేను(మనసులో): భగవంతుడా.. ఎందుకు తండ్రీ నన్ను ఇలా బడిపంతుళ్ళ మధ్య పుట్టించావూ?

తాతః మొహానికి మట్టి కొట్టి, పేడెట్టి అలికినట్టూ ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా తాతా..!
నేనుః తాతా... రాత్రికి నాకు రొయ్యల కూరా, చికెన్ కర్రీ కావాలి..నువ్వే చెయ్యాలి. (మరే.. వేడిగా ఉన్నప్పుడే పిజ్జా తినెయ్యాలి, చల్లగా ఉన్నప్పుడే బీరు తాగెయ్యాలి, కరిగిపోక ముందే ఐస్క్రీం నాకెయ్యాలి).
తాతః ఒసే.. పారోతీ... పెద్ద మనవడు వచ్చేడు కదా నేను బజారు కెళ్ళి కూర పట్టుకొస్తానే...! (ఒక వైపు  లుంగీ పంచ ఒక చేత్తో ఎత్తి పట్టుకొని బజార్ లో కి పోతూ)

 మా చిన్నపిన్నిః ఒరే బుజ్జీ.. ఎప్పుడొచ్చావ్ రా? దా... నేనో కవిత రాసేనూ.. ఆంధ్రభూమి కి పంపిద్దాం అనుకుంటున్నాను. విను..

"ఆకాశానికి ఆకలేసిందీ..."
"భూగోళానికి బాధేసిందీ.."
"యమలోకానికి ఏడుపొచ్చిందీ.."
""పాతాళం పగలబడి నవ్విందీ.."

 నేనుః పిన్నీ.. అర్జెంట్... బాత్రూంకి వెళ్ళొస్తానేం.. ఇక్కడే ఉండూ.. ఇప్పుడే వచ్చేస్తాను.

************************************************************

ఛీ.. నా దరిద్రం... రాజమండ్రి పోయి గోదాట్లో దూకినా, అమెరికా పోయి అమేజాన్ లో మునిగినా వదిలేలా లేదు. పనిలేని పిచ్చమ్మ కుంటి కుక్క కి కాలిగోళ్ళు తీసిందనీ...ఏమిటీ అరువు సేవ నాకూ? అనుకొని దిద్దుడు కార్యక్రమం ప్రారంభించాను.

తాత(బజార్ నుండి తిరిగొస్తూ) : ఎంత వరకూ వచ్చేయి రా ?
నేనుః చాలావి ఉన్నాయ్ తాతా ఇంకా అవ్వలేదు.
తాతః హ్మ్మ్.... నా కూతుళ్ళు బంగారు కొండలు అయితే.. కొడుకులు పోరంబోకులయ్యేర్రా..! మీ మాయలున్నారే.. దున్నపోతులకి జొన్నపొత్తులు మేపుతున్నట్టూ మేపుతుంటే, విలాసాలు ఎక్కువయ్యీ, ఎటకారాలు లావయ్యీ, పొగర్లు పెరిగిపోయి పనికొచ్చే పనులకి పదడుగుల దూరం పరిగెడ్తున్నారు. రోజంతా ఆ బెడ్డ (కార్క్ బాల్) ఇసురుకోడాలూ, తెడ్డు (క్రికెట్ బ్యాట్) తిప్పుకోడాలు తప్పా పనీ పాటా లేదురా ఎదవలకీ...!  మీ అమ్మ నాకు ఎంత హెల్ప్ చేసేదనుకున్నావ్? చదువుకుంటూ నాకు వ్యాపారం లో హెల్ప్ చేసేది. ఇంట్లో చెప్పిన పని చెప్పినట్టూ చేసుకుపోయేది. నీకన్నీ దాని పోలికలే..!

నేనుః చపాతీ లాంటి మొహాన్ని పూరీలాగా పొంగిస్తూ (ప్యాచ్ పడిన సైకిల్ టైర్ కి పంప్ కొడుతున్న సీన్ ని ఊహించుకోగలరు)

మా చిన్న మాయః అజారుద్దీన్ బ్యాటింగ్..అజారుద్దీన్ బ్యాటింగ్..!

తాతః అజారుద్దీన్ బ్యాటింగా?? వచ్చే.. .వచ్చే...  ఈ అజారుద్దీన్ మా పెద్దోడి లాగే ఉంటాడ్రా..! (టీవీ దగ్గరకి పరిగెడుతూ..!)
నేనుః ఎండాకాలం లో కప్పుకొనీ, శీతాకాలం లో విప్పుకుతిరిగేవాడిలాగా ఫేస్ పెట్టీ.
మా అమ్మమ్మః ఇయ్యన్నీ.. ఒక  తాను ముక్కలేరా...! ఆ  కిరికెట్టు ఆటంటే ఒంటి మీద తెలివుoదడు  మీ తాత కి.

************************************************************
రెండ్రోజులయ్యాక.. చేయగలిగినంతా చేసీ, బిక్క మొఖమేసి, చేతులెత్తేసిన నా మీద జాలి పడి మా తాతయ్య అద్బుతమైన ఆలోచన చేశారు.

తాతః హ్మ్మ్..శిలపడా... ఒక్కో పేరూ చదువు...!
నేనుః కంకిపాటి వెంకట లక్ష్మి..
తాతః ఆ.. ఈ పిల్ల బాగా చదువుతాది రా... ఓ ఎనభై మార్కులెయ్యి.
నేనుః పిల్లి నూకరాజు
తాతః వీడూ.. బానే చదువుతాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఓ డెబ్బై ఐదేస్కో..
నేనుః బండారు నాగదేవి.
తాతః ఆ... మనింటి పేరే ... కానీ ఈ పిల్ల ఏవరేజ్ స్టూడెంట్.. యాభై..ఎయ్యి.
నేనుః యలమంచిలి చందర్రావు
తాతః అబ్బే.. వీడు ఒట్టి సన్నాసెధవ. నలభై ఐదెయ్యి చాలు..
.
.
.
.
.
.
.
ఎందరో ఎవాల్యువేటర్స్.. అందరికీ వందనాలు

45 comments:

pallavi said...

Haha :)
super undi...
kani meeru review lu rayatam ledenti?
rayanu ani annaranukondi...
kani memu mee kasturamma garila, mee tatayya garila.. ekkadikellina vadalam :P

Sravya V said...

హ హ భలే ఉంది :))) btw నిజం గానే ఆ పేపర్లు అలా దిద్దిస్టారా ? ఇది మాత్రం నాకు కొంచెం ఆశ్చర్యం గానే ఉంది .

ఫోటాన్ said...

రాజ్!
చాలా రోజుల తర్వాతా కడుపుబ్బా నవ్వుకొనే టపా.. :)
సూపర్...
మీ మండలం లో ఊర్ల పేర్లు రాసిన మీ ఫ్రండ్ పేరేంటి? నవ్వలేక సచ్చాననుకో ఆ లైన్ చదివినపుడు :)))

Unknown said...

పంతుళ్ళ మధ్యలో పడితే జీవితం ఇంత నరకంగా ఉంటుందా రాజ్:))) ఓ ఏడేళ్ళు ఇంటర్ పిల్లలకి పాఠాలు చెప్పిన అనుభవంతో అన్నమాట..విస్తుపోతూఒ...

టపాకేముంది పగలబడి నవ్వుతూ...నువ్వు బెలూన్ ఫోటో పెట్టావే ఆ ముఖం తో నువ్వు రాసిన ఎక్స్ప్రెషన్స్ ఊహించుకుని వవ్వుకుంటూఒ....కొరియాలో ఈ మాత్రం టైం దొరికిందన్నమాట...గుడ్....

రసజ్ఞ said...

హహహ! ఎప్పటిలానే అద్భుతం. విధి వండిన వింత పాయసం కేవ్వ్వ్వ్. మీ పిన్నిగారి కవిత బాగుందండీ :):) నిజంగానే ఆవిడే వ్రాశారా లేదా మీరు వ్రాసేసి ఆవిడ పేరు పెట్టేసారా? మీరు చెప్పినట్టు దిద్దించే వారి గురించి విన్నాను కానీ చూడలేదు. మాష్టార్లు పేపర్లు మొత్తం దిద్దేసి టోటల్ చేయమని మాత్రం మాకిచ్చేవారు. అది కూడా మా క్లాసు వాళ్లవు తప్ప అందరివీను.
అవునూ నాకో సందేహం, "జాంకాయలు నములుతూ, పిప్పి కూర్చున్న కుర్చీ పక్కన ఊసేస్తూ" జామకాయలకి ఊసేసే పిప్పేం ఉంటుంది చెప్మా???? చదువు రాని వాళ్ళంటే జాలి లేదూ మీకు అసలు... నాగేష్ గారిని పాపం తిడతారా??? ఒకప్పుడు నాకూ మాప్ పాయింటింగ్ అస్సలు రాదు. ఒకసారి సోషల్ పరీక్షలో కన్యాకుమారి ఇస్తే ఎక్కడో తెలియక కాశ్మీర్లో పెట్టాను. మా మాష్టారు పిలిచి ఇక్కడ పెట్టావేంటి అంటే అదెక్కడో నాకు తెలియదు సార్ కాశ్మీరు లోయలో కన్యాకుమారి అన్న పాట గుర్తొచ్చి ఇక్కడ పెట్టేశా అన్నాను.

రాజ్ కుమార్ said...

పల్లవి గారూ.. హహహ... ప్రస్తుతం తెలుగు సినిమాలకి దూరంగా బతుకుతున్నానండీ.. ఇండియా వెళ్ళాక మళ్ళీ మొదలైపోద్ది.. ధన్యవాదాలు.. ;)

శ్రావ్యాజీ.. శ్రీ రామరాజ్యం సినిమా అంతా చూసీ బాలక్రిష్ణ కి నయనతార ఏమవ్వుద్దీ అని అడిగినట్టుందీ.. ;);)
నిజంగానేనండీ...
థాంకుల్స్.. ;)

రాజ్ కుమార్ said...

ఫోటానూ.. పేరు మార్చాను లే...కానీ ఆరోజు నేనూ నవ్వుకున్నా.. ;) ;) థాంక్యూ..

సునీత గారూ..కికికికి అందరూ ఇలా చేస్తారని కాదండీ.. ఇంటర్ లో ఇలా చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు. కానీ స్కూల్ డేస్ లో పెద్దగా ఇంట్రస్ట్ తీసుకోరుగా..
ధన్యవాదాలండీ..

రాజ్ కుమార్ said...

రసజ్ఞ గారూ.. మా పిన్ని అప్పట్లో ఆంధ్రభూమి లో "కోయిలా..కూయిలా" అని ఏదో కవితల ఆర్టికల్స్ ని తెగ చదివేవారు. ఆ కవితలు నాకు ఇలాగే అనిపించేవి అప్పట్లో.కికికికి ఆ తవిక మనదే.. ;)

పచ్చి జాంకాయలు మింగలేమండీ,రసం మింగేసీ మిగిలింది ఊసేస్తాంగా..!ఆరోజు చూసిన సీన్ అలా గుర్తుండిపోయి రాసేశాను ;)
చూశారా... మీరు వాడి మీద చూపుతున్న జాలిలో 10%అయినా నా మీద చూపట్లేదు.. ;( ;(

మీ కాశ్మీరు లోయ లాజిక్ అద్భుతం ..ధన్యవాదాలండీ..

భాస్కర్ కె said...

పిల్లల పేపర్లు దిద్దే మిషనొకటి కనుక్కోవాలని, నేను తెగ ట్రై చేస్తున్నానండి, మీరూ మీ స్థాయిలో మీ లాంటి పిల్లల కోసం కొంచం కృషి చేయకూడదూ,
nice one,keep writing.

వేణూశ్రీకాంత్ said...

హహహహహ ఎప్పట్లానే కేకన్నర పోస్ట్ రాజ్ :)) స్కూల్ రోజుల్లో పేపర్లు ఇలాగే దిద్దేవారు, నీరేంజ్ లో కాకపోయినా అపుడపుడు నేను కూడా ఇలా శలవల్లో పేపర్లు దిద్దడానికి బుక్ అయిన రోజులు గుర్తొచ్చాయ్ :))

స్వామి ( కేశవ ) said...

పోస్ట్ బాగుంది . మళ్ళీ స్కూల్ డేస్ గుర్తొచ్చాయి.
మీరూ నా టైపే కానీ, నేను మీకంటే కాస్త కంచు రకాన్నన్నమాట, పేపర్లు దిద్దేప్పుడు మా మాస్టార్లతో బేరాలు కూడా ఆడేవాడిని

నా పేపర్ నన్ను దిద్దుకోనిస్తే అన్ని పేపర్లు దిద్దిపెడతా ,

వదిలేసిన కొచ్చన్లకి ఆన్సర్లుకూడా రాయనిచ్చారనుకోండి కన్ఫాంగా రేపోద్దున్న దిద్దటం మొదలెడతా,

రాయకపోయినా మార్కులేసేసుకోనిచ్చారనుకోండి(మనకి పండగే) తత్కాల్లో దిద్దేస్తా.. ఇలా అన్నమాట ! :)

చిలమకూరు విజయమోహన్ said...

:):)

శశి కళ said...

ఆకాశానికి ఆకలేసిందీ..."
"భూగోళానికి బాధేసిందీ.."
"యమలోకానికి ఏడుపొచ్చిందీ.."
""పాతాళం పగలబడి నవ్విందీ.."
హ...హ...హ...కి..కి..కి...మరి ఏమి చెప్పాలో తెలీటం లేదు .మరి మాకు రెండు రోజుల్లో రిజల్ట్స్ ఇయ్యాలని పీకల మీద కూర్చుంటే ఏమి చేస్తాం చెప్పు.
అది పెద్ద కుటీర పరిశ్రమ...మా ఇంట్లో అందరం లేక్కలోల్లం అవ్వటం కలిసొచ్చిన విషయం నాకు...

అయినా ఇవన్ని మా చేత చెప్పించకూడదు...కావాలంటే కవిత వ్రాస్తాను...

పల్లా కొండల రావు said...

:)))బాగుంది పోస్టు. రాజ్ ! 7 నుండి 10 వరకూ అందరు టీచర్లకు అన్ని సబ్జక్ట్లకూ నాకిదే బాధ. అయితే నీలా చేయలేదబ్బాయ్. కానీ ఓ పంతులుగారబ్బాయి మాత్రం వాడి పేపర్ వరకూ తిరిగి రాసుకుంటే వాల్లయ్యకు అనుమానమొచ్చి కనిపెట్టాడు. చాలామంది బెటర్ స్టూడెంట్స్కి ఉండే తిప్పలే ఇవి. ఒక్క నెల పనిచేసిన హిందీ మాస్టర్ ఉన్నాడు. మీ తాత గారి లాగే కొలతేసి మార్కులేసేవాడు. ఇంకో సారున్నాడు. 7 వ తరగతిలో యూనిట్ టెస్టులలో అందరి సార్ల ప్రశ్నాపత్రాలు తీసుకెల్లి వాళ్లబ్బాయికి (అదే క్లాసు) ఇచ్చేవాడు. నీ పోస్టు చదువుతుంటే నా స్టడీ రోజులు జ్ఞాపకమొచ్చాయి. థేంక్యూ.

..nagarjuna.. said...

నీ పోస్ట్ చదివిన నాకు నవ్వొచ్చింది :)

Found In Folsom said...

Mahaprabhoo....buddhi undaga mee blog office lo chadavakoodadu anukuntana...kaani aatram aagi chavade..vedhava kakkurthi tho gaba gaba namili mingesalendi. Gattiga navvalemu, vachina navvuni aapukolemu...:(..as ususl super duper ga undi. Btw, maa tata naaku bit paper lu iche vaaru correct cheyamani. Manam ingilish medium kadaa...so zph students raase bootulaki paavulu ardhalu veste maa tata ala kadamma, ani okatlu, okatinnaralu vesevaadu pedda manasutho...:) ala boledu gnapakalu gurtu chesaru...intiki vellaka inko dafa chadivi pedddaga navvuta....sarena?

sarma said...

:)

asha said...

just wooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooW!!

శ్రీనివాస్ పప్పు said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ రాజ్ అరుపులు చప్పట్లు ఇజిల్స్

Raviteja said...

ప్యాచ్ పడిన సైకిల్ టైర్ కి పంప్ కొడుతున్న సీన్ ని ఊహించుకోగలరు ababababa e scene adhripoinde

నిరంతరమూ వసంతములే.... said...

ఇన్ని హాస్య గుళికలు ఓకే పోస్టులో ఏస్తే ఎట్టా రాజ్ గారు....నవ్వి నవ్వి నవ్వలేకపోయాను. ఎంతైనా చిన్నప్పటి ఆ రోజులే వేరు కదా!

గిరీష్ said...

>>దీన్నే సాఫ్ట్ వర్క్ అంటారని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యి హార్డ్ వర్క్ చేస్తుండగా తెలిసింది. >>

సూపరబ్బాయ్.. నా హైస్కూల్ రోజులని గుర్తుచేశావ్..థ్యాంక్స్.

>>ఎందరో ఎవాల్యువేటర్స్.. అందరికీ వందనాలు>>
టీచర్లా లేక మనమా? :)

గిరీష్ said...

@రసజ్ఞ గారు,
>> కాశ్మీరు లోయలో కన్యాకుమారి >>

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ అసలు మీ క్రియేటివిటీ.. :)

రాజ్ కుమార్ said...

@the tree.. పేపర్లు దిద్దె మిషనా...? ఈ కాన్సెప్టే కొత్తగా ఉందండీ.. నేను చేసిన చాకిరీ కి కృషీ అని పేరెట్టారా? ;) ధన్యవాదాలు

వేణూజీ.. సంతోషం.. ఇందులో కూడా బింగో.. ధన్యవాదాలు ః౦

స్వామి గారూ.. నేను బేరాలు గట్రా ఆడేవాణ్ణికాదండీ.. విలువ తగ్గిపోద్దనీ.. దర్జాగా కావల్సిన అన్సర్స్ రాసుకునేవాడిని.. కికికి.. థాంక్యూ

విజయ్ మోహన్ గారూ..థాంకులు ;)

రాజ్ కుమార్ said...

శశికళ గారూ... మీ కష్టాన్ని మామీద రుద్దేస్తారాండీ? పాపం మీ పిల్లలకీ ఇదే పరిస్థితా? ;);) రాయండి రాయండి కవిత ;) నెనర్లు


కొండలరావ్ గారూ.. ఓహో.. నేనొక్కడినే అనుకున్నా ఈ క్లబ్ లో మీరూ ఉన్నారా? సూపరు.. థాంకులు..

నాగార్జునా.. ఏడుపు రాకుంటే చాలు.. థాంక్స్ ;)

రాజ్ కుమార్ said...

@Found in Folsom గారూ... ఏమిటో.. ఎక్కడో తేలిపోతున్నట్టుంది మీ కమెంట్ చదూతుంటే.. ..తప్పకుండా చదవండీ.. సరేనా? అని అడగక్కర్లేదు... హృదయపూర్వక ధన్యవాదాలతో...

శర్మ గారూ.. థాంక్స్.. ;)


ఆశ గారూ... మీ వావ్ కి నా కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.... థాంక్సండీ


థాంక్యూ పప్పుసార్.. ;)

రవితేజా... హహహహ్.. ధన్య్వవాదాలు.

సురేష్ గారూ..హిహిహిహ్ థాంక్యూ సార్...

గిరీశూ.. ఆ డౌటేంటయ్యా... అందరమూనూ.. దిద్దేవాళ్ళందరూనూ.. ;)

కదా.. .రసజ్ఞ గారు అరాచకంః)

చాతకం said...

ROFL

I guess you too must love cricket madlly considering you are also made of same cloth. ;)
I too object to mistreatment given to.....jamakayalu!

kiran said...

ఈ టపా చదివి...పాత రోజులు అలా గుర్తు తెచ్చుకున్నా...
ఎందుకంటే నేను క్లాసు లీడర్ ఏ..మా అమ్మ టీచర్ ఏ..ఏమిటో...!!
మీ పిన్ని, నేను స్నేహితులం కాదు రాజ్..కాదు..కానీ మరి ఏంటో నా లాగే అందంగా రాసారు కవిత.. :P
సూపరబ్బాయ్ :)

laddu said...

Nenu paperlu dhiddhaledhu kaani, progress report lo markulu vesevanni ilaaaaaaaaa.

ఇందు said...

Raj ultimate post :)))))))) octopus bonda bagaa vantapattinattundu :)))

Anupama said...

ROFL!meeru super asalu. eppatilaane iragadeesaru..

రాజ్ కుమార్ said...

చాతకం గారూ.. నాకు క్రికెట్ అంటే ఇష్టమే కానీ మరీ అంత పిచ్చి లేదు..
జామకాయల మేటర్ నిజమేనండీ.. నేనేం ట్రీట్మెంట్ ఇవ్వలేదు.. ధన్యవాదాలు..

కిరణ్..నీకు కూడా సేం ఫ్లాష్ బ్యాక్ నా.. కికికి ఆ తవికలతో పోలిస్తే నీ తవికలు ఓ తవికలా? ;)
థాంక్యూ..!

రాజ్ కుమార్ said...

వంశీకృష్న గారూ కెవ్వ్వ్వ్వ్వ్.. నేను ఆ పనులూ చేశానుగా... ధన్యవాదాలు.. ;)

ఇందుగారూ ధన్యవాదాలు... ఇదిగో ఆ ఆక్టోపస్ మేటర్ ఎందుకండీ ఇప్పుడూ?

అనుపమ గారూ ధన్యవాదాలండీ.. ;)

Cartic said...

Hi Raj.. This is my visit to your blog.. edo blog chaduvutu , a blogger follow chese blogs lo e blog kanipinchindi.. peru variety ga undi kada ani open chesa.. e post chadiva.. keka asalu.. oka paata jyandala cinema chusina feeling vacchindi.. nenu usual ga telugu blogs chala takkuvaga chaduvutanu.. but enduko idi chadavalani pinchindi.. keep going.. I will be dropping here for more..

Unknown said...

శిలపడ బుల్లోడా పరీక్షా పేపర్ల దుమ్ము దులపర బుడ్డోడా !!
మీ తాత గారు ఇంటికి వచ్చాక చెప్పిన nonstop డైలాగ్ బాగుంది.

నేను విన్నా ఇలా "రుద్దుతారు" అని ;)
బాగుంది రాజ్ టపా మమ్మల్ని నవ్విస్తూ ......మరి కొరియా కష్టాలు అనే ఒక టపాతో ముందలకి వస్తే ఇంకొకసారి సంతోషిస్తాం !!

లక్ష్మీ శిరీష said...

Excellent post andi Raj gaaru :)

రాజ్ కుమార్ said...

@carthik happy to hear this :)
thnQ very much

@Sekhar thnx baabu ;) :)

@Lakshmy SiriSha garu.. thanx a lot ;)

జేబి - JB said...

Hahhahaa

రాజ్ కుమార్ said...

జే.బి గారు ;)ః)ః )

Prathyusha Davuluri said...

office lo undi chadivi tappu chesinattunnanu....manaspurtiga navvukolenu ikkada undi...intiki vellaka malli chadivi ma roommates ki kuda vinipistanu....chaala chaala bagundi esp. "దీన్నే సాఫ్ట్ వర్క్ అంటారని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యి హార్డ్ వర్క్ చేస్తుండగా తెలిసింది." too good. Thanks a ton for making us laugh :)

Radha said...

orey selapada.... :) baboi meeru entandi ila raastharu.. navvi navvi nizamga ne kadupu ubbipoindi.. office lo navvaleka, navvakunda undaleka thega ibbandi ayipoindi.
"paathaLam pagalabadi navvindi" nizamgane alane navvukunna
"panileni pichamma kunti kukka ki kaali goLLu theesinda? baboi that was hillarious

too good

మధురవాణి said...

హహ్హహ్హా.. ఎప్పట్లానే చాలా నవ్వించావ్ రాజ్.. ఇంకా సరిదిద్దడం, తీర్చిదిద్దడం అంటే నేనేంటో అనుకున్నా.. :D
కానీ, పరీక్ష పేపర్లు స్టూడెంట్స్ తో దిద్దించడం అనే కాన్సెప్టే కొత్తగా ఉంది. ఇలా కూడా చేస్తారని నేనిదే మొదటిసారి వినడం.. పాపం.. పిల్లలు కష్టపడి పరీక్షలు రాసిందే కాక మళ్ళీ దిద్దే పని కూడా హెంత అన్యాయం కదూ.. ప్చ్.. :(

రాజ్ కుమార్ said...

మధురగారూ.. థాంకులు ;)
కొత్తగా ఉండటం ఏంటండీ? ఇది చాలా మంది అనుభవించి ఉంటారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేక అలా అంటున్నారు ;) ;)
ధన్యవాదాలండి

Boyala24 said...

Hello raj gaaru
Mi blog chadavadam first time.
Mi fan association loo member ayipoyanandi.
School days loo papers diddinchadam gurthuteppincharu .
Miru koncham better school holidays loo diddevaru. Maa school teachers lunch break loo diddinchevaru unit test papers. Unit tests atipoyayi ante digulesedi lunch break taggipoothundani.
Awesome. Keep writing

Varoodhini said...

School days lo papers nenu kuda diddanu Raj... vichitramemitante, okasari question paper natone rayinchindi maa science madam(unit test lendi..).... ika chusko.... nenu class lo pedddddda leader aipoya.... Anyway, nee blog super Raj... navvapukolekapoya...n mallee padihenu samvatsaralu venakku teeskellaru...meeru keka boss...